GVL: ఇష్టమైనా, నష్టమనుకున్నా అన్ని పార్టీలూ కలిసిరాక తప్పదు: అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుపై జీవీఎల్
- అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు
- అన్ని పార్టీలూ మద్దతిస్తాయన్న జీవీఎల్
- ఎన్నో రాజ్యాంగ సవరణలను చేశామని వెల్లడి
అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ బిల్లు కోసం రాజ్యాంగ సవరణ తప్పనిసరికాగా, నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు రానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించక తప్పనిసరి పరిస్థితి నెలకొందని అన్నారు.
"అనేక రాజ్యాంగ సవరణలను మా ప్రభుత్వ హయాంలోనే, గత నాలుగున్నర సంవత్సరాల్లోనే తీసుకురావడం జరిగింది. వాటికి అన్ని పార్టీల మద్దతు కూడా లభించింది. అదే విధంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా అన్ని పార్టీలూ ఇష్టముండో... లేక నష్టమనుకునో తప్పనిసరిగా మద్దతివాలి. చేస్తాయని భావిస్తున్నాం" అని అన్నారు.