Andhra Pradesh: ఏపీ ‘రాష్ట్రానికి కేంద్ర హామీలు- ప్రతిపత్తి’పై నివేదిక విడుదల
- చట్టాల ద్వారా ఏపీ పునర్విభజన చేశారు
- రాజధాని తెలంగాణకు దక్కడంతో ఏపీకి నష్టం
- పన్నుల చెల్లింపు, బకాయిల్లోనూ నష్టమే
ఏపీ పట్ల కేంద్రం తీరుపై ప్రజాస్వామ్య పీఠం స్వతంత్ర నిపుణుల బృందం ‘రాష్ట్రానికి కేంద్ర హామీలు- ప్రతిపత్తి’ నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా చట్టాల ద్వారా ఏపీ పునర్విభజన చేశారని, రాజధానితో పాటు అధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం విభజన కోరిందని, రాజధాని తెలంగాణకు వెళ్లిపోవడం వల్ల, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో, విభజన చట్ట నిబంధనల వల్ల పన్నుల చెల్లింపు, బకాయిల్లో ఏపీకి నష్టం వాటిల్లిందని నిపుణులు పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకంజలో ఉందని, ‘కాగ్’ అంచనాల ప్రకారం ఏపీ ఆర్థికలోటు రూ.16,078 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.3,979.50 కోట్లు అని నిపుణులు పేర్కొన్నారు. ఏపీకి ఇస్తామని హామీ ఇచ్చిన మొత్తం రూ.4,117.89 కోట్లు కాగా, డిస్కమ్ లకు కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం రూ.1500 కోట్లు అని, డిస్కమ్ లకు కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆ నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు.