Arvind Kejriwal: సిగ్గులేని మోదీ ప్రభుత్వం.. చివరి వారాల్లో కూడా సీబీఐని ఎగదోస్తోంది: కేజ్రీవాల్
- రాజకీయ లబ్ధి కోసం సీబీఐని వాడుకుంటోంది
- ఐదేళ్లలో మోదీ ప్రత్యర్థులు ఎలాంటి కుట్రలను చవిచూశారో అందరూ గుర్తుంచుకోవాలి
- అప్రజాస్వామిక, నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సమయం ఆసన్నమైంది
మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై సిగ్గులేని మోదీ ప్రభుత్వం సీబీఐని ఎగదోస్తోందని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. అధికారం చివరి వారాల్లోకి వచ్చిన సమయంలో కూడా రాజకీయ లబ్ధి కోసం సీబీఐని వాడుకుంటోందని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో మోదీ ప్రత్యర్థులంతా ఎలాంటి కుట్రలను చవిచూశారో అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. తాజాగా అఖిలేష్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న సీబీఐ దాడులు మోదీ నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. అప్రజాస్వామిక, నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు.
అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్ ను సీబీఐ విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ మేరకు కేజ్రీవాల్ స్పందించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు కలసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు వెలువడిన వెంటనే... మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ మెరుపు దాడులు ప్రారంభమయ్యాయి. మరోవైపు అఖిలేష్ కు పలు పార్టీలు మద్దతును ప్రకటిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ దాడులకు తెగబడుతోందని విమర్శిస్తున్నాయి.