Bihar: బీహార్ హోమ్ లో అసభ్య గీతాలకు అమ్మాయిలతో డ్యాన్సులు, అతిథులతో వారిపై అత్యాచారాలు: సీబీఐ నివేదిక
- షెల్టర్ హోమ్ అకృత్యాలపై సీబీఐ విచారణ పూర్తి
- 20 మంది నిందితులపై 73 పేజీల చార్జ్ షీట్
- విస్తుపోయే నిజాలను వెలికితీసిన విచారణ
బీహార్ షెల్టర్ హోమ్ లో అమ్మాయిలపై జరిగిన అకృత్యాలు, సెక్స్ స్కాండల్ పై విచారణ జరిపిన సీబీఐ, సంచలన నివేదికను కోర్టుకు అందించింది. ఈ కేసులో బ్రజేష్ ఠాకూర్, షెల్టర్ హోమ్ నిర్వాహకులు సహా 20 మంది నిందితులు ఉండగా, వారిపై 73 పేజీల చార్జ్ షీట్ ను వేస్తూ, విస్తుపోయే నిజాలను తెలియజేసింది. షెల్టర్ హోమ్ లోని అమ్మాయిలకు మత్తుమందులు ఇచ్చి, వారితో అసభ్య గీతాలకు నృత్యాలు చేయించారని, బయటి నుంచి అతిథులను తీసుకు వచ్చి, వారితో రేప్ లు చేయించారని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖులు షెల్టర్ హోమ్ కు వచ్చి వెళుతుండేవారని పేర్కొంది.
వీరంతా అమ్మాయిలపై తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని చెబుతూ, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసి విచారించామని పేర్కొంది. టీనేజ్ అమ్మాయిలతో బలవంతంగా దుస్తులు విప్పదీయించి భోజ్ పురి చిత్రాల్లోని పాటలకు డ్యాన్సులు వేయించారని ఆరోపించింది. వారిని వ్యతిరేకించినా, ప్రశ్నించినా, చిత్ర హింసలు పెట్టేవారని పేర్కొంది. దాదాపు పదేళ్ల పాటు వీరి దందా సాగిందని, ఎంతో మంది అమ్మాయిలు వీరి అఘాయిత్యాలకు బలయ్యారని పేర్కొంది. షెల్టర్ హోమ్ లోని 42 మంది అమ్మాయిల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగిందని వైద్య పరీక్షలు నిరూపించాయని తెలిపింది. అధికార జనతాదళ్ ప్రభుత్వంలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న బ్రజేష్ ఠాకూర్ ప్రధాన నిందితుడని వెల్లడించింది.