Cheating: క్యాటరింగ్‌ వ్యాపారం పేరు చెప్పి రూ.4 కోట్లు కొట్టేసిన దంపతులు!

  • కిలాడీ దంపతుల నయా మోసం
  • లాభాల్లో వాటా ఇస్తామంటూ పెట్టుబడి దారులకు వల
  • హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఘటన

క్యాటరింగ్‌ వ్యాపారం అన్నారు. ఆశల పల్లకిలో ఊరేగించారు. అర చేతిలో లాభాల పంట పండించారు. ఆశపడిన వారికి వల వేశారు. కొందరు వారేవచ్చి బుట్టలో పడ్డారు. దీంతో పెట్టుబడి పేరుతో ఏకంగా రూ.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌ మహానగరం వనస్థలిపురంలో ఓ కిలాడీ జంట నయా మోసం ఇది.  పోలీసుల కథనం మేరకు...శారదానగర్‌లో నివాసం ఉంటున్న కొమ్మ సురేష్‌, అన్నపూర్ణలు దంపతులు. అన్నపూర్ణ బీడీఎల్‌ సంస్థలో ఉద్యోగి. ఐదేళ్లుగా వీరు క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. లాభాల్లో సగం వాటా ఇస్తామని చెప్పి పెట్టుబడి కోసం స్నేహితులు, తెలిసిన వారిని ఆశ్రయించే వారు.

ఈ విధంగా ఎవరైనా రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.9 వేలు లాభంగా ఇచ్చేవారు. బ్యాంక్‌ వడ్డీ కంటే పది రెట్లు అధిక మొత్తం వస్తుండడంతో చాలామందిని ఇది ఆకర్షించింది. దీంతో స్వచ్ఛందంగా పెట్టుబడి పెట్టేందుకు పలువురు ముందుకు రావడంతో దంపతుల పంట పండింది. తెలిసిన వారు 40 మంది నుంచి దాదాపు రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు.

తొలిరోజుల్లో చెప్పినట్టు లాభం ఇచ్చినా వ్యాపారం సరిగా లేదని కొన్ని నెలల నుంచి ఇవ్వడం మానేశారు. దీంతో పెట్టుబడి పెట్టిన వారు అసలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తమ వద్ద డబ్బులేదని చేతులెత్తేశారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిమోసం వెలుగు చూసింది. దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News