Telangana: తెలంగాణలో రేపు బంద్ కు దిగుతున్న ఆటో, క్యాబ్ సంఘాలు!
- మోటార్ వాహనాల చట్టం తెస్తున్న కేంద్రం
- వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
- బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన
తెలంగాణలో ఆటోలు, క్యాబ్ లపై ఆధారపడి ప్రయాణించేవారికి ఇబ్బంది ఎదురుకానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ వాహనాల సవరణ బిల్లు-2018ని నిరసిస్తూ రేపు ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బంద్ కు దిగుతామని ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్ ఐకాస కన్వీనర్ మహమ్మద్ అమానుల్లాఖాన్, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. మోటార్ వాహనాల బిల్లును కేంద్రంపై బలవంతంగా రుద్దుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రేపు ఆటో, క్యాబ్ బంద్, ఎల్లుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా బంద్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.