Andhra Pradesh: ప్రతిఒక్కరి ఇంటి కలను నెరవేర్చుతాం.. స్మార్ట్ ఫోన్లు ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతాం: సీఎం చంద్రబాబు
- ఇప్పటికే పట్టణాల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
- జీ ప్లస్ త్రీ విధానంలో రెండు పడక గదుల ఇళ్లు
- సహజ వనరులను కాపాడుకోవాలి
ఏపీలో ప్రతిఒక్కరి ఇంటి కలను నెరవేర్చుతామని సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పట్టణాల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, పట్టణాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
త్వరలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పామని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో ఉందని, అభివృద్ధిలో ఏపీని ప్రపంచంలోనే నమూనా రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. సహజవనరులు, అవకాశాలను వినియోగించుకోవడంలో పునాదిపాడు ఆదర్శమని, కాలువ గట్లపై ఇల్లు కట్టుకున్న వారికి కోరుకున్న చోట ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.