Jagan: కేసీఆర్ 'రైతుబంధు'కు ముందే నేను ఆ ప్రకటన చేశా: వైఎస్ జగన్
- గుంటూరు ప్లీనరీలోనే 'రైతు భరోసా'
- రైతు కుటుంబం ప్రాతిపదికన సాయం
- మొత్తం రూ. 50 వేలు ఇస్తానన్న జగన్
రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఏటా రెండు పంటలకు ఆర్థిక సహాయం చేసేలా కేసీఆర్ తీసుకువచ్చిన 'రైతుబంధు' పథకం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఆకర్షించిన వేళ, 'రైతుబంధు' కన్నా ముందే 'రైతు భరోసా' పేరిట రూ. 12,500 సాయాన్ని తన ప్రభుత్వం వస్తే ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
గుంటూరు ప్లీనరీలోనే తాను రైతు కుటుంబానికి భరోసాగా నిలుస్తానని చెప్పానని, నాలుగు సార్లు రూ. 12,500 ఇస్తూ, మొత్తం రూ. 50 వేలను ఒక్కో ఎకరాకూ ఇస్తానని అన్నారు. రాష్ట్రంలోని 85 లక్షల మంది రైతులకు ఈ పథకం లబ్దిని చేకూరుస్తుందని చెప్పిన జగన్, రాష్ట్రంలో రెండు ఎకరాలకన్నా తక్కువగా భూమి ఉన్న రైతుల సంఖ్య 42 లక్షలని, వారిని ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటానని అన్నారు.
ఎకరాకు ఇంతని కాకుండా, రైతు కుటుంబం ప్రాతిపదికన డబ్బులు ఇస్తానని చెప్పారు. దీనివల్ల అప్పుపుట్టని బడుగు రైతుకు పెట్టుబడి సాయం అందుతుందని, ఎక్కువ భూమి ఉన్న రైతులతో తామూ సమానమేనన్న భావన కలుగుతుందని జగన్ వ్యాఖ్యానించారు.