four children: అమ్మానాన్న తిట్టారని ఇంట్లో చెప్పకుండా బస్సెక్కిన చిన్నారులు!

  • గుంటూరు  జిల్లా నుంచి సూర్యాపేట చేరుకున్న నలుగురు చిన్నారులు
  • అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకున్న పోలీసులు
  • వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగింత

ప్రాథమిక పాఠశాల విద్య అభ్యసిస్తున్న నలుగురు చిన్నారులు బడికి సరిగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు తిట్టడంతో అలిగి చెప్పాపెట్టకుండా బస్సెక్కేశారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుని దిక్కుతోచక అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల కథనం మేరకు... ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి రమేష్‌, తమ్మిశెట్టి నాగేంద్రబాబు, ఉప్పునూతల రాము, ఉప్పునూతల నాగమణి పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. రాము, నాగమణిలు సరిగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వీరిద్దరూ ఇంట్లో లభించిన రూ.500 తీసుకుని బయటకు వచ్చారు.

తమ స్నేహితులైన రమేష్‌, నాగేంద్రబాబును కూడా వెంటబెట్టుకుని గ్రామంలో బస్సెక్కేశారు. అక్కడి నుంచి పిడుగురాళ్లకు చేరుకుని మిర్యాలగూడ మీదుగా సూర్యాపేటకు బస్సులో వచ్చారు. కొత్తబస్టాండ్‌ వద్ద తచ్చాడుతున్న వీరిని రాత్రి గస్తీ పోలీసులు గుర్తించారు. పట్టుకుని ప్రశ్నించడంతో ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చినట్లు తెలిపారు. వెంటనే వారిని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శనివారం తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు రాగా వారికి పిల్లల్ని అప్పగించారు.

  • Loading...

More Telugu News