income tax: ట్యాక్స్ ఎగ్గొట్టినప్పుడు దాడులు జరుగుతుంటాయి: సినీ నటుల ఇళ్లపై ఐటీ దాడులపై సీఎం కుమారస్వామి
- గత రెండు రోజులుగా దాడులు
- సినీ నటులు ఏమీ స్పెషల్ కాదన్న సీఎం
- వివక్ష లేకుంటే అభ్యంతరం లేదన్న డిప్యూటీ సీఎం
కర్ణాటకలో సినీ నటులు, నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. దాడులు రాజకీయ ప్రేరేపితం కాదని పేర్కొన్నారు. ‘‘నటుల ఇళ్లపై జరుగుతున్న దాడులు రాజకీయ ప్రేరేపితం కాదు. అధికారులు వారి విధుల్లో భాగంగానే సోదాలు చేస్తున్నారు’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఐటీ దాడులు ప్రతీ చోట జరుగుతున్నాయని, ట్యాక్స్ ఎగ్గొట్టినప్పుడు దాడులు జరుగుతుంటాయని అన్నారు. నటులు, నిర్మాతలైనంత మాత్రాన వారిని ప్రత్యేకంగా పరిగణించాల్సిన పనిలేదని, ఎవరైనా సరే చట్టాన్ని పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర మాట్లాడుతూ.. దాడులు రాజకీయ ప్రేరేపితం కాకుంటే, అందులో వివక్ష లేకుంటే తమకొచ్చిన అభ్యంతరం ఏమీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.
నటులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్ ఇళ్లతోపాటు నిర్మాతలు సీఆర్ మనోహర్, ‘రాక్‌లైన్’ వెంకటేశ్, విజయ్ కిరిగండూర్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు ఇక్కడితో ఆగిపోలేదని, కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు చూచాయగా తెలిపారు.