manmohansingh: పీవీ తర్వాత దేశంలో విజయవంతమైన ప్రధాని మన్మోహన్ మాత్రమే!: శివసేన నేత సంజయ్ రౌత్
- ఆయనను యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ అనడం సరికాదు
- దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించాలి
- మన్మోహన్‌పై బయోపిక్ నేపథ్యంలో రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో పి.వి.నరసింహారావు తర్వాత అత్యంత విజయవంతమైన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్‌సింగ్ మాత్రమేనని, ఆయనను యాక్సిడెంటల్ పీఎం అనడం సరికాదని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మన్మోహన్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ ఈనెల 11వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మన్మోహన్‌సింగ్‌గా నటించారు.
పదేళ్లపాటు దేశానికి సేవలందించిన మన్మోహన్‌ను గౌరవించాల్సిన అవసరం ఉందని, ఆయనను అనుకోకుండా వచ్చిన నాయకునిగా చూడకూడదన్నారు. ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షమైన శివసేన ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా రౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రంపై కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తోంది. చిత్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు.