Telangana: తెలంగాణలో తగ్గుతున్న చలి.. శీతల గాలులకు మహారాష్ట్ర అడ్డుకట్ట!
- ఉత్తరాది శీతల పవనాలు తగ్గుముఖం
- మహారాష్ట్రలో తుపాను వ్యతిరేక పవనాలు
- 4 డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలంగాణను దాదాపు వారం రోజుల పాటు వణికించిన చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఇప్పటివరకూ ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర తీరంలో తుపాను వ్యతిరేక పవనాలు ఏర్పడటంతో ఇవి చల్లటి గాలులను నిరోధిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం తూర్పు భారతం నుంచి రాష్ట్రంపైకి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో గత రెండు రోజుల్లో ఉష్ణోగ్రత దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని పేర్కొన్నారు.