Rahul Gandhi: అవినీతి, రాఫెల్ డీల్ పై మోదీని విచారించాలి: రాహుల్ గాంధీ
- నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మోదీ పారిపోయారు
- జైట్లీ ప్రసంగంలో నాపై విమర్శలు తప్ప మరేమీ లేదు
- అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాఫెల్ డీల్ పై క్రిమినల్ విచారణ జరిపిస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, మిలియన్ల డాలర్ల రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటులో రాఫెల్ పై జరిగిన చర్చలో పాల్గొనకుండా మోదీ పారిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ చాంతాడంత ప్రసంగం ఇచ్చారని... ఈ సందర్భంగా తనపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని... తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని విమర్శించారు. ప్రధాని తరపున రక్షణ మంత్రి మాట్లాడుతున్నారని... తమ ప్రశ్నలకు వారైనా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్నీ కోరుతున్నాయని చెప్పారు.
రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ధరను రూ. 526 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు పెంచాలని ఎవరు నిర్ణయించారని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు. ధర పెరగడానికి ప్రధాని కారణమా? లేక రక్షణశాఖ కారణమా? అని అడిగారు. యుద్ధ విమానాల సంఖ్యను 36కు తగ్గించింది ఎవరని ప్రశ్నించారు. అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరని నిలదీశారు. కొత్త డీల్ కు సంబంధించి రక్షణశాఖ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తిందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై అవినీతి కేసులతో పాటు... అంతర్జాతీయంగా అప్పులపాలైన అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్ట్ ను అప్పగించి, దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన అంశంపై విచారణ జరిపించాలని అన్నారు.