Andhra Pradesh: జగన్ హత్యాయత్నం కేసులో జోరు పెంచిన ఎన్ఐఏ.. విచారణ అధికారిగా సాజిద్ ఖాన్ నియామకం!
- కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
- సీఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదుపై ముందుకు
- గతేడాది అక్టోబర్ 25న కోడికత్తితో దాడి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసును హైకోర్టు ఈరోజు ఎన్ఐఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును టేకప్ చేసిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ.. అదనపు ఎస్పీ సాజిద్ ఖాన్ ను విచారణ అధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తును వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ ఎన్ఐఏను ఆదేశించింది.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో గతేడాది అక్టోబర్ 25న శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణలో సైతం జగన్ మెడపై దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడనీ, దాడి సరిగ్గా జరిగి ఉంటే జగన్ చనిపోయేవారని తేలింది. కత్తి భుజంపై గుచ్చుకోవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జగన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.