Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట.. ‘అమరావతి’ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b271197d06149c361f31f3660aaaac6633b419ed.jpg)
- కృష్ణా నది పక్కనే నిర్మించడంపై అభ్యంతరం
- అనుమతులు సరైనవేనన్న సుప్రీంకోర్టు
- పిటిషనర్ పై కోర్టు అసహనం
అమరావతికి సరైన పర్యావరణ అనుమతులు తీసుకోలేదని దాఖలైన పిటిసన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమరావతి నిర్మాణం కృష్ణా నది పక్కనే సాగుతోందనీ, ఇది నిబంధనలకు విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
అమరావతికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరైనవేనని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ స్పందిస్తూ.. ఇలాంటి పిటిషన్లు దురదృష్టవశాత్తూ భారత్ లోనే వస్తాయని వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని అమరావతిని కృష్ణా నది పక్కన నిర్మిస్తున్నారనీ, ఇది పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఈఏఎస్ శర్మ తొలుత జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన ఎన్జీటీ.. రాజధాని నిర్మాణం నిబంధనల మేరకే సాగుతోందని స్పష్టం చేసింది. శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.