2019: ఒకటి, రెండు రోజులు సెలవు పెట్టుకుంటే... ఈ సంవత్సరం వచ్చే వరుస సెలవులివి!
- సెలవులు పెట్టుకుంటే భారీ వారాంతాలు
- అన్ని పండగలకూ కలిసొచ్చే శని, ఆదివారాలు
- ముందే ప్లాన్ చేసుకుంటే ఆనందమే ఆనందం
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో ఒకటి లేదా రెండు రోజులు సెలవు పెట్టుకోగలిగితే, మూడు నాలుగు రోజుల సెలవు లభించే వారాంతాలు దాదాపు 10 వరకూ రానున్నాయి. దూర ప్రయాణాలు, విహార, వినోదయాత్రలు చేయాలని భావించేవారు ఎప్పుడు సెలవులు పెట్టుకుంటే ఎన్నిరోజులు ఎంజాయ్ చేయవచ్చో ఓ లుక్కేస్తే...
సంక్రాంతి సందడిలో జనవరి 12 నుంచి 15 వరకూ సెలవులు ఆనందించవచ్చు. కనీసం ఒకరోజు సెలవు పెట్టుకోవాల్సివుంటుంది. మార్చిలో 2 నుంచి 4 మధ్య ఆదివారం, మహాశివరాత్రి ఉంటాయి. ఓ రోజు సెలవు పెట్టుకుంటే మూడు రోజుల పాటు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లవచ్చు. ఇక మార్చిలోనే 21 నుంచి 24 మధ్య శని, ఆదివారాలు, హోలీ వస్తాయి. ఓ రోజు సెలవు పెడితే, నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడిపేయవచ్చు.
ఏప్రిల్ విషయానికి వస్తే 19 నుంచి 21 మధ్య ఆదివారం, హోలీ వస్తాయి. ఈ సంవత్సరం రెండు రోజుల సెలవుతో అత్యధికకాలం సెలవు ఆగస్టు 10 నుంచి 18 మధ్య ఉంటుంది. సెకండ్ శాటర్ డేతో మొదలయ్యే ఈ సెలవుల్లో బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం సెలవులు కలిపి వారమంతా ఎక్కడైనా చుట్టి రావచ్చు. ఆగస్టులో 31 నుంచి సెప్టెంబర్ 2 మధ్య వినాయకచవితి, వారాంతం ఉంటుంది.
అక్టోబర్ లో మహర్నవమి, విజయదశమి పర్వదినాలను కలుపుతూ 5 నుంచి 8 వరకూ నాలుగు రోజుల పాటు, ఆపై 26 నుంచి 28 వరకూ దీపావళి సందర్భంగానూ ఓ రోజు సెలవు పెట్టుకుంటే, మూడు, నాలుగు రోజుల టూర్ వేసుకోవచ్చు. సంవత్సరం చివరిలో రెండు రోజులు సెలవు పెట్టుకోగలిగితే డిసెంబర్ 21 నుంచి 25 వరకూ విహారానికి వెళ్లవచ్చు. ఇందులో నాలుగో శనివారం, ఆదివారం క్రిస్మస్ ఉంటాయి. ఇక ముందే ప్లాన్ చేసుకుంటే ఈ సెలవులను కుటుంబంతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు!