Chandrababu: ముగ్గురు మోదీలు ఒక్కటై ఏపీపై కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు

  • మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు
  • మోదీ ఓడిపోవడం ఖాయం
  • సస్పెన్షన్ లకు భయపడం
  • అన్యాయం చేశారనే బయటకు వచ్చాం

రాజధాని శంకుస్థాపనకు పునాది వేయమని ప్రధాని మోదీని ఆహ్వానిస్తే.. వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి రావల్సిన వాటి గురించి అడిగితే మోదీ తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి మోదీ నమ్మక ద్రోహం చేశారని.. తమకు చేయూతనిస్తే గుజరాత్‌ను మించిపోతామని మోదీకి భయమన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్డీయేకు పూర్తి వ్యతిరేకంగా ఉందని.. ఈసారి ఎన్నికల్లో మోదీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.

ప్రత్యేక హోదా అడిగితే మాట మార్చి గారడీలు చేస్తున్నారని.. ముగ్గురు మోదీలు ఒక్కటై ఏపీపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని పోరాడుతున్న ఎంపీలను సస్పెండ్ చేశారని.. అలాంటి వాటికి భయపడేది లేదన్నారు. పోలవరానికి రూ.7 వేల కోట్లు ఇచ్చామంటున్నారని.. కానీ ఇంకా రూ.74 వేల కోట్లు ఇవ్వాలన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రెస్ వాళ్లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేసిందనే కేంద్రం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. రాఫెల్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ మాత్రం స్పందించరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మోదీ చెప్పేవన్నీ అసత్యాలేనని ఆయన అన్నారు.


  • Loading...

More Telugu News