Andhra Pradesh: అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డయినా తింటారు.. బురద చల్లటం ఆయన నైజం!: ఆర్కే రోజా
- చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- టీడీపీ-జనసేనకు ఒకే ఫైనాన్షియర్ ఉన్నారు
- రాబోయే ఎన్నికల్లో విజయం జగన్ దే
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారనీ, అవసరమైతే గాడిద కాళ్లు పట్టుకుంటారని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ తో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో అంటకాగుతున్నారని విమర్శించారు. పార్టీలతో జతకట్టడం, ఆ తర్వాత వారిపైనే బురద చల్లడం చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు.
600 అబద్ధాల హామీలు ఇచ్చిన చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు, సొంతంగా వైసీపీని స్థాపించిన జగన్ కు తేడా కేవలం 5 లక్షల ఓట్లేనని తెలిపారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్ గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కూడా ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ-జనసేన బంధానికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు.