India: ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న హనుమ విహారి, పుజారా... ముగిసిన తొలిరోజు ఆట!
- తొలి రోజు 303/4
- 130 పరుగులు సాధించిన పుజారా
- 39 పరుగులతో నాటౌట్ గా హనుమ విహారి
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా సాగింది. రహానే 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయిన తరువాత, హనుమ విహారితో కలిసిన సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
ఎవరు బౌలింగ్ కు వచ్చినా నిదానంగా ఆడుతూ, అప్పుడప్పుడూ బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆసీస్ కెప్టెన్ ఎంతమంది బౌలర్లను మార్చినా మరో వికెట్ ను తీయలేకపోయాడు. ప్రస్తుతం పుజారా 130 పరుగులతో (16 ఫోర్లు), హనుమ విహారి 39 పరుగులతో (5 ఫోర్లు) ఉన్నారు. రేపు భారత స్కోరును 400 పరుగులు దాటిన తరువాత భారత్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించే అవకాశం ఉంది. తొలి రోజు ఆటలో స్టార్క్, హాజిల్ వుడ్, కుమిన్స్, లియాన్, లాబుస్ చేంజ్ లు బౌలింగ్ చేయగా, హాజిల్ వుడ్ కు రెండు వికెట్లు దక్కాయి.