bihar: ‘మన్మోహన్ సింగ్’ సినిమాకు నిరసనల సెగ.. నటుడు అనుపమ్ ఖేర్ పై కేసు నమోదు!

  • బిహార్ కోర్టును ఆశ్రయించిన న్యాయవాది ఓజా
  • మన్మోహన్, సోనియా కుటుంబం పరువు తీశారని పిటిషన్
  • జనవరి 8న విచారించనున్న కోర్టు

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. దీంతో మన్మోహన్ సింగ్ పరువు తీసేలా సినిమాను తీశారంటూ నటుడు అనుపమ్ ఖేర్ పై కేసు నమోదయింది. బిహార్ కు చెందిన సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఖేర్ తో పాటు చిత్రబృందంపై పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయమై ఓజా స్పందిస్తూ..‘సినిమాలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, ప్రధాని సలహాదారు సంజయ్‌ బారు పాత్రలో అక్షయ్‌ ఖన్నా నటించి వారి పరువు తీశారు. ఇది నన్నే కాదు ఎంతో మందిని బాధించింది. ఈ సినిమాలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా పాత్రల్లో నటించినవారు కూడా వారి ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు, నిర్మాతపై కూడా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.

తన ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించిందని వెల్లడించారు. ఈ నెల 8న తాను దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని తప్పుగా చూపారంటూ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.  విజయ్‌ రత్నాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News