China: మానవ చరిత్రలో తొలిసారి... చందమామ ఆవలివైపున దిగిన చైనా రోవర్!

  • సురక్షితంగా ల్యాండ్ అయిన 'ఛంఘీ-4'
  • అమెరికా, రష్యాలు సాధించలేనిదాన్ని చేసి చూపిన చైనా
  • వెల్లడించిన చైనా అధికార మీడియా

చందమామ... పున్నమి నాటి రాత్రి ఆరుబయట పడుకుని చంద్రుని చూస్తూ, అక్కడ కుందేలు కనిపిస్తోందని, ఓ ముసలమ్మ చెట్టుకింద కూర్చుందని అనుకోనివారుండరు. ఆ ఊహలు కాసేపు పక్కన పెడితే, మన కంటికి కనిపించని చంద్రుని అవతలివైపు ఏముంది? ఇంతవరకూ చీకట్లో ఉన్న ఆ భాగానికి ఎవరూ చేరుకోలేదు. మానవ చరిత్రలో తొలిసారిగా చైనా, చంద్రుడికి అవతలివైపునకు చేరుకున్న ఘనతను దక్కించుకుంది. 'ఛంఘీ-4' (చైనా పురాణాల్లో చంద్ర దేవత) పేరిట ప్రయోగించిన రోవర్, సురక్షితంగా చందమామకు అవతలివైపున ల్యాండ్ అయిందని దేశ అధికార మీడియా ప్రకటించింది.

2013లో చంద్రుడిపై రోవర్ ను సురక్షితంగా దించి, ఆ ఘనత సాధించిన అమెరికా, రష్యాల సరసన చేరిన చైనా, ఇప్పుడు ఆ రెండు దేశాలూ చేయలేకపోయిన పనిని చేసింది. "ప్రపంచ స్థాయి అంతరిక్ష పరిశోధనల్లో చైనా మిగతా దేశాలకన్నా ముందడుగు వేసింది" అని మకావ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్, చైనా అంతరిక్ష విభాగానికి సహకరించిన జూ మెంగుహా వ్యాఖ్యానించారు. అమెరికన్లు ప్రయత్నం చేయడానికి కూడా భయపడిన పనిని చైనా ప్రజలు చేసి చూపించారని ఆయన అన్నారు.

కాగా, ఆలస్యంగా ప్రారంభించినా అంతరిక్ష సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటూ అగ్రరాజ్యానికి సవాల్ విసురుతున్న చైనా, సమీప భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు), క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర అంశాల్లోనూ అమెరికాను దాటుతుందని చైనా నిపుణులు అంటున్నారు. 2022 నాటికి పూర్తి స్థాయి స్పేస్ స్టేషన్ ను అంతరిక్షంలో నిలపాలన్న లక్ష్యంతో చైనా కృషి చేస్తోంది.

  • Loading...

More Telugu News