Kerala: తీవ్ర ఉద్రిక్తంగా మారిన కేరళ బంద్... అయ్యప్ప భక్తుడిని చంపేశారని బీజేపీ మండిపాటు!
- రాళ్లదాడికి దిగిన సీపీఎం, బీజేపీ కార్యకర్తలు
- 'శబరిమల కర్మ సమితి' సభ్యుడు చంద్రన్ ఉన్నితన్ మృతి
- పలు ప్రాంతాల్లో విధ్వంసం
కేరళలో కొనసాగుతున్న బంద్, ఓ నిరసనకారుడి మరణంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పందళం ప్రాంతంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్రంగా గాయపడిన 'శబరిమల కర్మ సమితి' సభ్యుడు చంద్రన్ ఉన్నితన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన మృతిపై మండిపడ్డ బీజేపీ, అయ్యప్ప భక్తుడిని పినరయి సర్కారు హత్య చేసిందని ధ్వజమెత్తింది.
ఈ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతుండగా, పలు ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించిన నిరసనకారులు, టైర్లను తగులబెట్టారు. త్రిశూర్ ప్రాంతంలో ఓ బస్సును ధ్వంసం చేశారు. జనజీవనం స్తంభించిపోగా, తిరువనంతపురం, కాలికట్, మలప్పురం ప్రాంతాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బంద్ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా, నిరసనలు తగ్గకపోవడంతో కేరళ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.