Andhra Pradesh: ప్రజల సమస్యలను విని వెంటనే పరిష్కరిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది!: సీఎం చంద్రబాబు
- జన్మభూమికి అద్భుత స్పందన
- ప్రజల బాధను అర్ధం చేసుకోవాలి
- అమరావతిలో సీఎం టెలీ కాన్ఫరెన్స్
జన్మభూమి కార్యక్రమానికి తొలిరోజే అద్భుతమైన స్పందన వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారనీ, వారిలో పెరిగిన చైతన్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ఫిర్యాదుదారుల్లో బాధ ఉంటుందనీ, నేతలు, అధికారులు దీన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని అన్నారు. అమరావతిలో ఈరోజు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై కలెక్టర్లు, అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుందని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని విమర్శించారు.
దీన్ని అధికారులు, నేతలు గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. చుక్కల భూమి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు 18,527 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రభుత్వానికి అందే ఫిర్యాదుల్లో వీలైనంత ఎక్కువ వాటిని ఈ 10 రోజుల్లోనే పరిష్కరించాలని ఆదేశించారు.