Save sabarimala: శబరిమల వివాదం.. లింగ సమానత్వాన్ని కోరుతూ 620 కిలోమీటర్ల పొడవున అడ్డు'గోడ'గా నిలిచిన మహిళలు!
- 14 జిల్లాల వ్యాప్తంగా ‘విమెన్ వాల్’
- కార్యక్రమానికి పోటెత్తిన మహిళ
- ‘సేవ్ శబరిమల’కు కౌంటర్
శబరిమల వివాదం పలు మలుపులు తిరుగుతోంది. అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మొదలైన వివాదం దేశవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. సుప్రీం తీర్పును తప్పుబడుతూ పలు హిందూ సంఘాలు ‘సేవ్ శబరిమల’ పేరుతో ఉద్యమం చేస్తుండగా, ఇప్పుడు దానికి కౌంటర్‌గా అధికార పార్టీ సీపీఎం ‘వనితా మతిల్’ అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. లింగ సమానత్వం పేరుతో మంగళవారం జాతీయ రహదారుల వెంట భారీ మానవహారాన్ని నిర్వహించారు.
ఉత్తరాన కాసర్‌గడ్ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 14 జిల్లాల మహిళలు 620 కిలోమీటర్ల పొడవున ‘మహిళా గోడ’ (విమెన్ వాల్) కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు, రచయితలు, అథ్లెట్లు, నటులు, రాజకీయ నేతలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రభుత్వ అధికారులు, గృహిణులు సుమారు 35 లక్షల మంది పాల్గొన్నట్టు అంచనా. వీరందరూ కలిసి బలవంతపు సంప్రదాయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు.
‘విమెన్ వాల్’ కోసం పాఠశాలలకు మధ్యాహ్నం సెలవులు ప్రకటించారు. పరీక్షలను వాయిదా వేశారు. కాసర్‌గడ్‌లో ఈ కార్యక్రమానికి కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ సారథ్యం వహించగా, తిరువనంతపురంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ నేతృత్వం వహించారు.