Sabarimala: అయ్యప్ప ఆలయంలోకి మహిళలు.. నిరసనగా రేపు కేరళ బంద్!
- అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ
- దేశవ్యాప్తంగా కలకలం
- ఆలయాల మూసివేత.. సంప్రోక్షణ
దశాబ్దాల సంప్రదాయాన్ని ఉల్లంఘించి బిందు, కనక దుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై కేరళ భగ్గుమంది. మహిళల ప్రవేశానికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా శబరిమల కర్మ సమితి రాష్ట్రవ్యాప్తంగా హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హర్తాళ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది.
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన బిందు (44) సీపీఐ (ఎంఎల్) కార్యకర్త. కాలేజీ లెక్చరర్ కూడా. 42 ఏళ్ల కనకదుర్గ కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. గత నెల 24న శబరిమల వచ్చి ఆలయంలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసిన 11 మంది మహిళల బృందంలో వీరు కూడా ఉన్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. మహిళ ప్రవేశానికి నిరసగా దేశవ్యాప్తంగా అయ్యప్ప ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.