Ramakant Achrekar: సచిన్ టెండూల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూత.. విషాదంలో టెండూల్కర్!
- వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అచ్రేకర్
- ఈ సాయంత్రం కన్నుమూసినట్టు తెలిపిన బంధువులు
- తీవ్ర దిగ్భ్రాంతిలో సచిన్
రమాకాంత్ అచ్రేకర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరిది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్‌లో ఓనమాలు దిద్దించిన ఆయన ఈ సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. 87 ఏళ్ల అచ్రేకర్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డులు అందుకున్న రమాకాంత్ తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దిందీ సచిన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు.
తాను క్రికెట్ నేర్చుకుంటున్నప్పుడు వివిధ టోర్నమెంట్ల కోసం అచ్రేకర్ స్కూటర్‌పై తనను తీసుకెళ్లేవారని సచిన్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అచ్రేకర్ ఇక లేరన్న విషయాన్ని ఆయన బంధువు రష్మి దల్వి తెలిపారు. తన గురువు ఇక లేరన్న విషయం తెలిసి సచిన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
సచిన్‌తోపాటు వినోద్ కాంబ్లి, ప్రవీణ్ ఆమ్రే, సమీద్ దిఘే, బల్విందర్ సింగ్ సంధు వంటి వారు కూడా అచ్రేకర్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు. అయితే, సచిన్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి, తన గురువు అచ్రేకర్‌కు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టాడు.