Kerala: బ్రేకింగ్: అయ్యప్ప ఆలయంలో నవ చరిత్ర... ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం... విలపిస్తున్న భక్తులు!
- పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు
- స్వామిని దర్శించుకున్న బిందు, కనకదుర్గ
- భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటంతో పని ముగించిన పోలీసులు
- ఆలయం అపవిత్రమైందని వాపోతున్న భక్తులు
కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. శబరిమలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి, మకరవిళక్కు పూజల కోసం స్వామి ఆలయాన్ని తెరచిన వేళ, మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు.
బిందు, కనకదుర్గ అనే మహిళలు స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.