Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతాయి
- మొదటి విడత ప్రక్రియ జనవరి 7-21 వరకు
- రెండో విడత జనవరి 11- 25 వరకు
- మూడో విడత జనవరి 16-30 వరకు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నట్టు చెప్పారు. మొదటి విడత పోలింగ్ జనవరి 21న, రెండో విడత పోలింగ్ జనవరి 25న, మూడో విడత పోలింగ్ జనవరి 30న జరుగుతుందన్నారు.
ఇక మొదటి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21న, రెండో విడత జనవరి 11న ప్రారంభమై 25న, మూడో విడత జనవరి 16న ప్రారంభమై 30వ తేదీన ముగుస్తాయని వివరించారు. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ గుర్తును చేర్చినట్టు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం నిమిత్తం మైకులు వినియోగించాలని నాగిరెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత నగదు డిపాజిట్ చేయాలో నాగిరెడ్డి వివరించారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, వార్డు సభ్యులుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు- రూ.500, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలకు చెందిన అభ్యర్థులు రూ.2,50,000 మించి, ఐదు వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీల అభ్యర్థులు రూ.1,50,000 కు మించి ఖర్చు చేయరాదని నిర్ణయించామని, ఈరోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు నాగిరెడ్డి తెలిపారు.
కాగా, మొత్తం 12,732 గ్రామ పంచాయతీల్లోని 1,13,170 వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు, రెండో విడత, మూడో విడతల్లో వరుసగా 4,137, 4,115 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.