Andhra Pradesh: నవ్యాంధ్ర చరిత్రలో ఆవిష్కృతమైన మరో చారిత్రక ఘట్టం... నేటి నుంచి అమరావతిలో హైకోర్టు!

  • రాష్ట్రం విడిపోయిన నాలుగున్నరేళ్లకు హైకోర్టు విభజన
  • తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు
  • ప్రమాణం చేయించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

నవ్యాంధ్ర చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, నాలుగున్నరేళ్లుగా ఉమ్మడిగానే ఉన్న హైకోర్టు నేడు అధికారికంగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక అమరావతి కేంద్రంగా సాగనుంది. ఈ ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, హైకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మరో 12 మంది న్యాయమూర్తులతోనూ గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నాలుగున్నరేళ్లకు, గత నెల 26న ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 కాగా, అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం ఇంకా పూర్తికాని నేపథ్యంలో, క్యాంపు కార్యాలయంలోనే తాత్కాలికంగా హైకోర్టు మొదలుకానుంది. తొలి మూడు రోజుల పాటు హైకోర్టులోని అన్ని బెంచ్ లూ పని చేయనుండగా, నాలుగో తేదీ నుంచి వెకేషన్ బెంచ్ సేవలందిస్తుంది. ఈ నెల 20 తరువాత క్యాంపు కార్యాలయంలోని తాత్కాలిక కోర్టును సిటీ కోర్టు కాంప్లెక్స్ కు తరలించనున్నారు. ఆపై పూర్తి స్థాయిలో కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయి.

Andhra Pradesh
High Court
Amaravati
Oath
Justis Praveen Kumar
  • Loading...

More Telugu News