Andhra Pradesh: చంద్రబాబు బయోపిక్ కు రెండు పేర్లు సూచించిన వైసీపీ నేత బాలశౌరి!
- తండ్రీకొడుకులు ప్రజల చెవుల్లో పూలుపెడుతున్నారు
- సోనియా గాంధీ దయ్యంగా కనిపించడం లేదా?
- 23 మంది ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పండి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ఏపీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేత బాలశౌరి విమర్శించారు. హైకోర్టు కట్టడంలో విఫలమైన చంద్రబాబు, ఇప్పుడు సాకులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని దయ్యంతో పోల్చిన చంద్రబాబుకు ఇప్పుడు ఆమె దయ్యంలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బాలశౌరి మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ 9 శ్వేతపత్రాలు విడుదల చేశారనీ, ఆయనకు నిజంగా దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఎన్నికోట్లు ఇచ్చి కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ను జేసీ దివాకర్ రెడ్డి దూషిస్తుంటే చంద్రబాబు ముసిముసిగా నవ్వారనీ, ఇదే ఆయన సంస్కారమా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్, జయలలిత జీవితాలపై బయోపిక్ లు తెరకెక్కుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదే తరహాలో చంద్రబాబు బయోపిక్ కూడా తీస్తే దానికి ‘మహానగరంలో మాయగాడు’ ‘యూటర్న్ మోసగాడు’ అని టైటిల్ పెట్టవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.