Andhra Pradesh: 50 శాతం వేతన సవరణ కోరుతూ.. సమ్మె నోటీస్ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ!
- అలవెన్సులు 100 శాతం పెంచాలని విజ్ఞప్తి
- రిటైర్మెంట్ వయసు 60కి పెంచాలి
- ఆర్టీసీకి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్
జీతాలు, అలవెన్సుల పెంపు కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 50 శాతం వేతన సవరణ, 100 శాతం అలవెన్సుల పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ రోజు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును కలుసుకున్న ఈయూ నేతలు నోటీసులను అందజేశారు. ఉద్యోగుల్లో అన్ని వర్గాలతో చర్చించి త్వరలోనే సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఈయూ నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్న విషయాన్ని గుర్తుచేశారు. నష్టాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కోరారు. కాగా, ఈ సమ్మెకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.