Hyderabad: భాగ్యనగరంలో నేటి రాత్రి 10 గంటల తర్వాత ఫ్లైఓవర్ల మూసివేత
- యువత అత్యుత్సాహాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు
- వీఐపీ జోన్లో ఫ్లైఓవర్లపై మరింత నిఘా
- డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడి
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించే యువత ఆశలపై భాగ్యనగరం పోలీసులు నీళ్లు చల్లారు. హైదరాబాద్ నగరంలోని వీఐపీ పరిధిలో ఉండే ఫ్లైఓవర్‌తోపాటు మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల తర్వాత మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడికక్కడ కాపుకాసి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కూడా చేపడతామని హెచ్చరించారు. ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పోలీసులు, ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మద్యం మత్తులో అత్యంత వేగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపేందుకు యువత ఉత్సాహం చూపుతారని, ఇందుకోసం ఎక్కువగా ఫ్లైఓవర్లు వినియోగిస్తారని పోలీసులు చెబుతున్నారు.
అదే సమయంలో కొందరు ప్లైఓవర్లపైనే వాహనాలను నిలిపి చిందులు వేసే అవకాశం ఉందని, ఇవన్నీ రాత్రిపూట ప్రమాద హేతువులుగా మారుతాయని ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. అందువల్ల రాత్రి పది గంటల తర్వాత ప్రధాన ఫ్లైఓవర్లన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా వీఐపీలు ఎక్కువగా ఉండే వెస్ట్‌జోన్‌లో పలు ఫ్లైఓవర్లు ఉన్నాయి. బేగంపేట ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పీఎన్టీ, ప్రకాష్‌నగర్, బేగంపేట ఫ్లైఓవర్లు, పంజాగుట్ట పరిధిలోని గ్రీన్‌ల్యాండ్, సీఎం క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట ఫ్లైఓవర్లు ఉన్నాయి.
వీటిని రాత్రి పదిగంటల తర్వాత మూసివేయనున్నారు. తెల్లవారు జామున ఐదు గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. వెస్ట్‌జోన్ ట్రాఫిక్ పరిధిలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, బేగంపేట ట్రాఫిక్ పీఎస్ ల పరిధిలో స్టార్ హోటళ్లు, పబ్‌లు ఎక్కువగా ఉండడంతో పోలీసులు ఆ ప్రాంతంపై గట్టి నిఘా ఉంచుతున్నారు.