RBI: రూ.19,567 కోట్లు.. బ్యాంకుల్లో మూలుగుతున్న ఈ సొమ్ము ఎవరిదీ కాదట!
- గతేడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ
- డీఈఏకు బదిలీ కానున్న సొమ్ము
- గడువులోపు రీ క్లెయిమ్ చేసుకునే అవకాశం
ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము రూ.19,567 కోట్లు ఉందని ప్రభుత్వం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. గతేడాది బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము రూ.14,697 కోట్లు కాగా, ఈసారి అది రూ. 19,567 కోట్లకు పెరగడం విశేషం.
ఈ సొమ్మును భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి చెందిన డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేయనున్నారు. గత పదేళ్లుగా ఎవరూ నిర్వహించకుండా ఉన్న బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లను డీఈఏ చూసుకుంటుంది. ఒకసారి ఈ క్లెయిములు సెటిల్ అయ్యాక ఈ సొమ్మును ఆర్థిక అవగాహనను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తుంది. ఈ సొమ్మును డీఈఏ ఫండ్‌కు బదిలీ చేసినప్పటికీ తమ సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంటుంది. అయితే, గడువులోపు అందకు సంబంధించిన విధివిధానాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.