Amaravati: ఏపీ సెక్రటేరియేట్ రెండో టవర్ ర్యాఫ్ట్ పూర్తి!
- 27న మొదలైన పనులు
- ఈ ఉదయం 7 గంటలకు పూర్తి
- వారం రోజుల పాటు క్వారింగ్
నాలుగు రోజుల క్రితం 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ టవర్-2కు శంకుస్థాపన చేసిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఈ ఉదయం 7 గంటలకు పూర్తయింది. ఈ విషయాన్ని సీఆర్డీయే అధికారులు ప్రకటించారు. సుమారు 72 గంటల పాటు నిర్విరామంగా కాంక్రీట్ ను పోశామని తెలిపారు. 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతులో ఈ ర్యాఫ్ట్ ఉందని, దీని నిర్మాణం నిమిత్తం 8800 టన్నుల కాంక్రీట్ ను వాడామని తెలిపారు.
కాంక్రీట్ పూర్తయిన వెంటనే ఉపరితలంపై క్యూరింగ్ కాంపౌండ్ ను పూశారు. ఈ క్యూరింగ్ ను సాధారణంగా నీళ్లు చల్లుతూ కాకుండా, 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ర్యాఫ్ట్ ను ఉంచుతారు. వేడి కోసం కాంక్రీట్ ఉపరితలంపై మూడు లేయర్లలో ప్లాస్టిక్, థర్మాకోల్ షీట్లు వేశారు. మరో వారం తరువాత క్యూరింగ్ పూర్తి అయితే, ప్రధాన నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా, సచివాలయం మూడో టవర్ ర్యాఫ్ట్ పనులు నేడు ప్రారంభం కానున్నాయి. జీఏడీ టవర్ ర్యాఫ్ట్ పనులు బుధవారం మొదలవుతాయి.