India: దిగ్గజ దర్శక-నిర్మాత, పద్మభూషణ్ గ్రహీత మృణాల్ సేన్ కన్నుమూత!
- గుండెపోటుతో కన్నుమూసిన దర్శకుడు
- సత్యజిత్ రే, రిత్విక్ సమకాలీకుడు
- సంతాపం తెలిపిన రాష్ట్ర పతి కోవింద్, మమతా బెనర్జీ
దిగ్గజ బెంగాలీ ఫిల్మ్ మేకర్, పలు జాతీయ అవార్డుల గ్రహీత మృణాల్ సేన్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని సొంత ఇంటిలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దిగ్గజ దర్శకులైన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ లకు మృణాల్ సేన్ సమకాలీకుడు. బ్రిటిష్ ఇండియాలోని ఫరీదాపూర్(ఇప్పటి బంగ్లాదేశ్)లో 1923, మే 14న ఓ హిందూ కుటుంబంలో మృణాల్ సేన్ జన్మించారు.
మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ రాత్ భోరే 1955లో విడుదల అయింది. రెండో సినిమా 'నీల్ ఆకాశర్ నీచే'తో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. 1976లో మృగయా సినిమాకు బెస్ట్ క్రిటిక్ ఫిల్మ్ ఫేర్ అవార్డు ఆయన్ను వరించింది. 1984లో ఖాన్ దార్ సినిమాకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే, 1982లో అకాలే షాన్ధానే సినిమాకు ఉత్తమ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.
అంతేకాకుండా 2017లో ఆయనకు ఫిల్మ్ ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. 1983లో కేంద్రం ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మృణాల్ సేన్ 2003లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. కాగా, మృణాల్ సేన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.