kcr: నాడు బట్రాజ్ మాదిరి పొగిడి.. ఇప్పుడు తిట్టడమేంటి? : కేసీఆర్ కు బాబు సూటి ప్రశ్న
- నాడు జన్మభూమి గురించి పొగిడింది నువ్వు కాదా?
- జనార్ద న్ రెడ్డి హయాంలో ఐటీ టవర్ కు ఫౌండేషన్ వేశారట?
- ఎక్కడేశారు? ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదే!
గతంలో కూడా తాను శ్వేతపత్రాలు విడుదల చేశానని, అప్పుడు కేసీఆర్ తన వద్దే ఉన్నాడని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘1995లో ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రాలు చేశాం. 2004కు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాం. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ టవర్ కు ఫౌండేషన్ వేశారట? ఎక్కడేశారు? ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదే!
ఐటీ గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు. అవన్నీ అమలు చేసింది నేను. 1995 నుంచి మీరు (కేసీఆర్) లేరా నా పక్కన? ఈ ఏరియా అంతా మీరు తిరిగారు కదా? మీరే పొగిడారు కదా! జన్మభూమి గురించి పొగిడింది మీరు కాదా? బ్రహ్మండంగా, బట్రాజ్ మాదిరి పొగిడి.. ఇప్పుడు నువ్వు తిట్టడమేంటి? ఒక పద్ధతి లేకుండా రాజకీయాలేంటి?’ అని మండిపడ్డారు.
హైకోర్టు విభజన చేసి ఏపీ న్యాయవాదులను ఉన్నపళంగా వెళ్లమనడం తప్పని, కొంత సమయం ఇవ్వమని అడిగితే తప్పనడం కరెక్టు కాదని చంద్రబాబు అన్నారు. విశాఖపట్టణంలో ఇటీవల జరిగిన ఎయిర్ షో విషయంలో కూడా కేంద్రం ప్రవర్తించిన తీరు సబబు కాదని మండిపడ్డారు. ఏపీ ఏమన్నా శత్రుదేశమా? ఇండియాలో భాగం కాదా? తాము పన్నులు కట్టడం లేదా? అలాంటి, నరేంద్ర మోదీని నెత్తినపెట్టుకుని కేసీఆర్ మోస్తున్నారని దుయ్యబట్టారు.