KCR: చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ దేశంలో ఎవరూ లేరు: కేసీఆర్
- ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు అనుకుంటారు
- ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయి
- చంద్రబాబును చూసి ఏపీ ప్రజలు సిగ్గుపడాలి
రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతోందని... ఏ సీఎం అయినా, ఏ నాయకుడైనా వారి ప్రజలకు ఇబ్బంది కలగకుండా హైకోర్టును అక్కడకు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏది పడితే అది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటారని... ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయని విమర్శించారు. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
డిసెంబర్ నాటికి హైకోర్టును ఏపీకి తీసుకెళతామని ఏపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని... హైకోర్టును ఏపీకి తీసుకెళ్లాల్సిన అవసరంలేదని... ఇక్కడే రెండు హైకోర్టులను వేర్వేరుగా నిర్వహించవచ్చని తాము కూడా అఫిడవిట్ వేశామని చెప్పారు. కోర్టును సపరేట్ చేస్తే చాలని తాము చెప్పామని అన్నారు. రెండు అఫిడవిట్లను చూసిన సుప్రీంకోర్టు... ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకుని... జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు విధులను ప్రారంభించాలని ఆదేశించిందని తెలిపారు.
డిసెంబర్ లోనే హైకోర్టును సిద్ధం చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం... ఇంకా ఎందుకు కోర్టును సిద్ధం చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. అలాంటప్పుడు అఫిడవిట్ ఎందుకు వేశారని అడిగారు. హైకోర్టును విభజించింది సుప్రీంకోర్టు అని... సుప్రీం తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై మాత్రమే చేసిందని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని... అంతా ఆయన ఇష్టమేనా? అని దుయ్యబట్టారు. చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను ఏ నాయకుడిని కలిస్తే చంద్రబాబుకు ఏం సమస్య అని కేసీఆర్ ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు మోదీకి డబ్బా కొట్టి... ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన చేరారని చెప్పారు. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రిని చూసి, ఏపీ ప్రజలు సిగ్గుపడాలని అన్నారు. ఏ మొహం పెట్టుకుని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని చెప్పారు.