New Delhi: ఢిల్లీ వసతిగృహంలో దారుణం.. బాలికలపై నిర్వాహకుల అమానవీయ చర్యలు!
- 6-15 ఏళ్ల బాలికలతో వెట్టిచాకిరి
- మంచి భోజనం కూడా పెట్టని నిర్వాహకులు
- పోలీసులకు మహిళా కమిషన్ ఫిర్యాదు
దేశరాజధానిలోని ఓ బాలికల వసతిగృహం నిర్వాహకులు అమానవీయంగా ప్రవర్తించారు. చిన్నారులతో వెట్టిచారికి చేయిస్తూ వారిని తీవ్రంగా హింసించారు. ఎదురు తిరిగితే తీవ్రంగా కొట్టడంతో పాటు భోజనం పెట్టకుండా వేధించేవారు. దీంతో వారంతా మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ మహిళా కమిషన్ చేపట్టిన సాధారణ తనిఖీల్లో ఈ దారుణం వెలుగుచూసింది. కమిషన్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఆ వసతి గృహానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఢిల్లీలోని ఓ వసతి గృహంలో 6 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న 22 మంది అమ్మాయిలు ఉంటున్నారు. అయితే ఈ హాస్టల్ నిర్వాహకులు మాత్రం చిన్నారులతో చాలా దారుణంగా ప్రవర్తించేవారు. చిన్నారులు హాస్టల్ లో ఉండగా చిన్న తప్పు చేసినా జననాంగాలపై కారం చల్లి రాక్షసానందం పొందేవారని ఢిల్లీ మహిళా కమిషన్ విచారణలో తేలింది. అక్కడితో ఆగకుండా వసతి గృహంలో బట్టలు ఉతకడం, వంటపాత్రలను కడగడం, గదులను శుభ్రం చేయడం, టాయిలెట్లను కడిగించడం వంటి పనులను తమచేత చేయించేవారని బాలికలు అధికారులకు చెప్పారు.
ఈ సందర్భంగా తమ మాట వినని చిన్నారులను తీవ్రంగా దండించేవారనీ, జననాంగాలలో కారం చల్లేవారని వెల్లడించారు. పండుగ సమయాల్లో ఇళ్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేవారనీ, కనీసం మంచి భోజనం కూడా పెట్టడం లేదని వాపోయారు. కాగా, అమ్మాయిల సమస్యలను అధికారులు కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ నిర్వాహకుల నిర్వాకంపై విచారణ ప్రారంభించారు.