sikkim: మంచులో చిక్కుకుపోయిన 400 వాహనాలు.. 3 వేల మందిని రక్షించిన సైన్యం
- సిక్కింలో భారీగా కురుస్తున్న మంచు
- నాథులా పాస్ నుంచి తిరిగి వస్తూ మంచులో చిక్కుకుపోయిన పర్యాటకులు
- సురక్షిత ప్రాంతాలకు తరలించిన సైన్యం
భారత్-చైనా సరిహద్దులో ఉన్న సిక్కింలోని నాథులా పాస్ వద్ద చిక్కుకుపోయిన 3 వేల మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా... నాథులా పాస్ కు వెళ్లి తిరిగి వస్తున్న దాదాపు 300 నుంచి 400 వరకు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. మంచులో చిక్కుకుపోయిన పర్యాటకుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన సైన్యం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని, చలిని తట్టుకునే దుస్తులను అందించారు.
1500 మంది పర్యాటకులను 17వ మైలు ఆర్మీ క్యాంపులో ఉంచామని, మిగిలిన వారిని 13వ మైలు క్యాంపులో ఉంచామని ఆర్మీ అధికారులు తెలిపారు. పర్యాటకులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు భారీ డోజర్లు, యంత్రాలను సైన్యం ఉపయోగిస్తోంది.