Andhra Pradesh: కర్నూలులో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత రాంపుల్లారెడ్డి!
- మంత్రి అఖిలప్రియ అవినీతిపై విమర్శలు
- హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
- త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. జిల్లాలోని ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాంపుల్లా రెడ్డి వైసీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అనుచరులతో ఆళ్లగడ్డలో భేటీ అయిన రాంపుల్లారెడ్డి, టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అఖిలప్రియ ప్రభుత్వ పథకాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అఖిలప్రియ అవినీతి వ్యవహారంపై తెలుగుదేశం హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు పథకం కింద అఖిలప్రియ చేసిన అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై గత కొంతకాలంగా అలకబూనిన రాంపుల్లారెడ్డి, మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారు. కాగా, రాంపుల్లా రెడ్డి వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.