USA: అర్ధరాత్రి న్యూయార్క్ లో అలజడి.. ఏలియన్స్ దాడి అంటూ హడలిపోయిన ప్రజలు!

  • నీలం రంగులోకి మారిపోయిన ఆకాశం
  • సోషల్ మీడియాలో పోస్టులు వైరల్
  • ట్విట్టర్ లో స్పందించిన న్యూయార్క్ పోలీసులు

అగ్రరాజ్యం అమెరికాలో వింతలు, విచిత్రాలకు కొదవ ఉండదు. అక్కడ గ్రహాంతర వాసులను(ఏలియన్స్) చూశామని కొందరు చెబితే, మరికొందరేమో ఏకంగా ఏలియన్స్ తమను కిడ్నాప్ చేశాయని చెబుతుంటారు. తాజాగా అక్కడి న్యూయార్క్ నగర ప్రజలు అర్ధరాత్రి పూట హడలిపోయారు. ఆకాశమంతా నీలిరంగులోకి మారి వెలుగులు విరజిమ్మడంతో ఏలియన్స్ దాడికి వస్తున్నాయని భయపడిపోయారు. దీనికితోడు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన గురువారం నాడు న్యూయార్క్ పట్టణంలో చోటుచేసుకుంది.

చివరికి ఈ వెలుగుల కారణంగా స్థానికంగా విమానాల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ వెలుగు వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకున్న ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుని నవ్వుకున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న కాన్ ఎడిసన్ అనే విద్యుత్ కంపెనీ ప్రాంగణంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లకు మంటలు అంటుకుని పేలిపోయాయి. అందులోని రసాయనాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు నీలి రంగు వెలుగు ఈ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదీ సంగతి! 


  • Loading...

More Telugu News