Andhra Pradesh: ఆ బాకీ తీర్చకుంటే తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళతాం!: ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక
- కేంద్రం సహాయనిరాకరణ చేస్తోందని మండిపాటు
- విద్యుత్ ఉచితంగా ఏమీ రాదని చురకలు
- అమరావతిలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంటికి ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర సాయం లేకపోయినా రామాయపట్నం పోర్టును సొంతంగా ప్రారంభించామని వెల్లడించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజావేదికలో భాగంగా ‘విద్యుత్-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై శ్వేతపత్రాన్ని సీఎం విడుదల చేశారు.
ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఇంకా ఏపీకి రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. కరెంట్ అన్నది ఫ్రీగా రాదని చురకలు అంటించారు. తెలంగాణ ఆ బాకీని తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇందుకు తెలంగాణ ముందుకు రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని బాబు హెచ్చరించారు.
అలాగే సింగపూర్ కు విజయవాడ నుంచి ప్రారంభించిన విమాన సర్వీసుకు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.