Telangana: ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు.. ఇంటి ముందు బాధితురాలి ఆందోళన!
- తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం
- అదనపు కట్నం కోసం వేధించిన అత్తారింటివారు
- చివరికి అరెస్ట్ చేయించిన బాధితురాలు
ప్రాణం ఉన్నంతవరకూ తోడుగా ఉంటానని పెళ్లాడిన భర్త మాట తప్పాడు. ఆడపిల్ల పుట్టడాన్ని సాకుగా చూపుతూ అదనపు కట్నం కోసం వేధించసాగాడు. చివరికి మరో యువతిని వివాహం చేసుకుని ఆమెకు తీవ్ర అన్యాయం చేశాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయినా నిందితుడికి శిక్ష పడకపోవడంతో చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్ తో 2014లో వివాహం అయింది. పెళ్లి సమయంలో అమ్మాయి తరఫువారు రూ.4 లక్షల కట్నం ఇచ్చుకున్నారు. కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ లాస్యకు పాప పుట్టడంతో సమస్యలు ప్రారంభం అయ్యాయి. అమ్మాయి పుట్టింది కాబట్టి అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్త శివశంకర్ తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు.
ఈ సందర్భంగా లాస్య పుట్టింటికి వచ్చింది. అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అధికారుల కౌన్సెలింగ్ విఫలం కావడంతో చివరికి భర్త సహా 9 మందిపై కేసు పెట్టింది. దీంతో అధికారులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి న్యాయం కోసం లాస్య కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, చిన్నారితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.