vanpic case: అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్.. తాను బదిలీ కావడంతో వాదనలు వినలేనన్న న్యాయమూర్తి!
- సీబీఐ కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత
- వాదనలు వినిపించేందుకు సిద్ధమైన జగన్ లాయర్
- తనను ఏపీ కోర్టుకు కేటాయించినందున వినలేనన్న న్యాయమూర్తి
ఉమ్మడి హైకోర్టు విభజన ప్రభావం అప్పుడే కేసులపై కనిపిస్తోంది. వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో నిన్న జగన్ సహా నిందితులు పలువురు కోర్టుకు హాజరైనప్పటికీ విచారణ కొనసాగలేదు. వాన్ పిక్ కేసులో నిందితునిగా ఉన్న తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని జగన్ పెట్టుకున్న డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు జగన్ తరపు న్యాయవాది సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎం.వెంకటరమణ కల్పించుకుని న్యాయాధికారుల విభజనలో భాగంగా తనను ఏపీకి కేటాయించారని తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో తాను వాదనలు వినడం సరికాదని పేర్కొన్నారు. దాంతో కేసును జనవరి 4కు వాయిదా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య న్యాయాధికారులను కేటాయిస్తూ ఉమ్మడి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేయడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరొకరిని నియమించే అవకాశం ఉంది.