Team India: బాక్సింగ్ డే టెస్ట్: విజయం దిశగా భారత్.. పోరాడుతున్న కంగారూలు
- 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభిస్తున్న బుమ్రా
- భారత్ విజయానికి కావాల్సింది ఆరు వికెట్లే
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 106/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన కోహ్లీ సేన ఆసీస్ ముందు 399 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు నాలుగో రోజు 54/5 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ (33) ఔటైన తర్వాత కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
399 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ అరోన్ ఫించ్ (3) ఔటయ్యాడు. జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్కస్ హ్యారిస్ (13)ను జడేజా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. ఉస్మాన్ ఖావాజా (33), షాన్ మార్స్ (44)లు కూడా కాసేపు పోరాడి అవుటయ్యారు.
ఆ విధంగా 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (25), మిచెల్ మార్ష్ (3) క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 274 పరుగులు అవసరం కాగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయం దాదాపు ఖాయమన్నట్టే.