Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆఫీసుపై జీఎస్టీ అధికారుల దాడులు!

  • రూ.73.5 లక్షల పన్ను చెల్లించని మహేశ్ బాబు
  • ఇప్పటికే బ్యాంకు అకౌంట్లను జప్తు చేసిన జీఎస్టీ కమిషనర్
  • రెండు న్యాయస్థానాల్లో మహేశ్ కు దక్కని ఊరట

ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అధికారులు షాక్ ఇచ్చారు. మహేశ్ బాబు కార్యాలయంపై ఈరోజు దాడులు నిర్వహించారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మహేశ్ వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును చెల్లించాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేస్తూ జీఎస్టీ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు.

తాజాగా హైదరాబాదులోని మహేశ్ బాబు ఆఫీసుపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం మహేశ్ ఆఫీసుకు చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఈ పన్ను వివాదంపై మహేశ్ బాబు ఛార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు గతంలో పన్ను వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించారని తెలిపారు.

అక్కడ చుక్కెదురు కావడంతో మహేశ్ హైకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో తాజాగా జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. యాక్సిస్ బ్యాంకులో మహేశ్ ఖాతాలో ఉన్న రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నామనీ, ఇంకో 30.5 లక్షలను వసూలు చేయాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News