Andhra Pradesh: స్వచ్ఛమైన బంగారం ఇవ్వలేదని కల్యాణ మండపం నుంచి పరారైన వరుడు!
- ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఘటన
- వివాహానికి ముందే మొదలయిన గొడవ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయి కుటుంబం
అమ్మాయి ఫోన్లో మాట్లాడుతోందనీ, వాట్సాప్ లో ఎక్కువ సేపు ఉందని గతంలో పెళ్లిళ్లు రద్దు కావడాన్ని మనం చూసుంటాం. కానీ తాజాగా అత్తవారు స్వచ్ఛమైన బంగారం ఇవ్వలేదన్న కోపంతో ఓ పెళ్లి కొడుకు వివాహ వేదిక నుంచి పరారయ్యాడు. దీంతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని తనకల్లు మండలం టీ సదుంకు చెందిన రఫీకి కదిరిలోని నిజాంవలి కాలనీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమయింది. ఈ నేపథ్యంలో కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్‌లో నిఖా నిర్ణయించారు. అయితే వివాహ సమయంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు స్వచ్ఛమైన బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగానే అమ్మాయివారు 10 తులాల బంగారం అందించారు. ఇది స్వచ్ఛమైన బంగారం కాదని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే పెద్ద మనుషులు ఇరుకుటుంబాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తీరా నిఖా సమయానికి పెళ్లి కుమారుడు మండపం నుంచి పరారయ్యాడు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లితో పాటు ఇతర ఏర్పాట్లకు రూ.లక్ష వరకూ ఖర్చు అయిందని అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదులో తెలిపారు. అబ్బాయి మంచివాడని చెప్పడంతో వివాహానికి అంగీకరించామని, కానీ అతను ఇంత మోసగాడని తెలుసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే కుటుంబం తమ కంటే రూ.50,000 ఎక్కువ కట్నం ఇస్తానని చెప్పడంతోనే పెళ్లి నుంచి రఫీ పరారయ్యాడని వారు ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.