ntr biopic: ఎన్టీఆర్ బయోపిక్ లో నన్ను నెగటివ్ గా చూపించారో.. తీవ్ర పరిణామాలు ఉంటాయి!: నాదెండ్ల భాస్కరరావు వార్నింగ్
- క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
- తనను తప్పుగా చూపించవచ్చని నాదెండ్ల వ్యాఖ్య
- లీగల్ నోటీసులు పంపానని వెల్లడి
నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) జీవితంపై దర్శకుడు క్రిష్ ‘కథా నాయకుడు’, 'మహానాయకుడు' పేర్లతో రెండు భాగాల సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై 1984, ఆగస్టు 15న తిరుగుబాటు చేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఈరోజు స్పందించారు. ‘ఎన్టీఆర్' బయోపిక్ లో తన గురించి తప్పుగా, నెగటివ్ గా చూపించే ప్రయత్నం జరగొచ్చని ఆయన అన్నారు.
తనను నెగటివ్ గా చూపించరాదని ఇప్పటికే చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు జారీచేశామని వెల్లడించారు. ఒకవేళ ఈ సినిమాలో తనను నెగటివ్ గా చూపిస్తే తర్వాత జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా ఉండి పనులు చేయించుకోవాలనీ, వైరం పెట్టుకోరాదని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే అంతిమంగా రాష్ట్ర ప్రజలే నష్టపోతారని వ్యాఖ్యానించారు.