Telangana: ఆఫ్రికాలా ఏపీ వెనుకపడకూడదు.. అందుకే రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారుచేస్తున్నా!: చంద్రబాబు
- మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టాం
- తెలంగాణలో సేవా రంగం 64 శాతానికి చేరింది
- ఆరో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం
సహజ వనరులు అపారంగా ఉన్నప్పటికీ మానవ వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఆఫ్రికా ఖండం వెనుకపడిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా పోరాట యోధుడు నెల్సన్ మండేలా కూడా చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచి ఇంజనీరింగ్ వరకూ ఏపీని ఓ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. అమరావతిలో ఈరోజు ‘విద్య, వైద్యం, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం’పై చంద్రబాబు ఆరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా సేవారంగం వాటా 64 శాతానికి చేరుకుందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రాలో సమర్థవంతమైన మానవనరుల కోసం గత నాలుగేళ్లలో రూ.1,31,000 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. పాఠశాల విద్యకు రూ.79,504 కోట్లు, ఉన్నత విద్యకు రూ.15,150 కోట్లు, ఆరోగ్య రంగం కోసం రూ.30,513 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీ చాలా సమస్యలు ఎదుర్కొందని సీఎం గుర్తుచేశారు. ప్రాథమిక విద్యారంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.