Bansuwada: పక్కింటి యువకుడితో వివాహేతర బంధం.. మందలించినందుకు మామను చంపించిన కోడలు!
- బాన్సువాడ సమీపంలో ఘటన
- ఈ నెల 22న గంగారాం అనే వృద్ధుడి హత్య
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
భర్త అమాయకుడు కావడంతో, పక్కింట్లోనే ఉన్న యువకుడితో వివాహేతర బంధాన్ని పెట్టుకున్న ఓ యువతి, అడ్డుగా ఉన్నాడన్న నెపంతో తన మామను దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన బాన్సువాడ సమీపంలోని చిన్న రాంపూర్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 22న గ్రామంలోని బీర్కూర్ గంగారాం (60) అనే వృద్ధుడు హత్యకు గురికాగా, విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు.
లావణ్య అనే యువతికి విఠల్ అనే అమాయకుడితో పెద్దలు వివాహం జరిపించగా, ఆమె పక్క ఇంట్లో ఉండే పృథ్వీరాజ్ అలియాస్ రాజుతో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం గంగారాంకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. రాజును కలవవద్దని గంగారాం గట్టిగా చెప్పడంతో, అతని అడ్డు తొలగించుకోవాలని లావణ్య నిర్ణయించుకుంది.
వెంటనే తన సెల్ ఫోన్ నుంచి రాజుకు మెసేజ్ పంపి, తన మామను హత్య చేయాలని కోరింది. కుంట్లమోరి వంతెన నిర్మాణ పనుల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గంగారాం వద్దకు వెళ్లిన రాజు, నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు. మెడపై నరకడంతో చనిపోయాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని పోలీసులు తెలిపారు.